ఈ నెల 20వ తేదీన ప్రత్యేక టీకా డ్రైవ్

 ఈనెల 30 తేదీ వరకూ కర్ఫ్యూ పొడిగింపు: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి

   


 SPREAD NEWS(అమరావతి);- ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక టీకా డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను రాష్ట వ్యాప్తంగా 124 మంది పిల్లలను గుర్తించామన్నారు. వారిలో 86 మంది పేరున రూ.10 లక్షల చొప్పున నగదు డిపాజిట్ చేశామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

     తూర్పు గోదావరి జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాలో కర్ఫ్యూ లో సడలింపులు ప్రకటించిందన్నారు. తూర్పు గోదావరి మినహా మిగిలిన జిల్లాల్లో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విధించిన కర్ఫ్యూను సాయంత్రం ఆరు గంటల వరకూ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

     సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూను పకడ్భందీగా అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు 12.25 శాతంగా ఉండడంతో, ప్రస్తుతం అమలు చేస్తున్నవిధంగానే... ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ 144 సెక్షన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రబుత్వం నిర్ణయించిందన్నారు.

     కర్ఫ్యూలో సడలింపుతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ సాధారణ సమయాల్లోనే పనిచేయనున్నాయన్నారు. ఉద్యోగులందరూ విధిగా కార్యాలయాలకు హాజరు కావాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో కలిపి ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు పొందేవారి సంఖ్య 90.54 శాతం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 12,814 మంది చికిత్స పొందుతుంటే. 11,602 మంది ఆరోగ్య శ్రీ పథకం కింద కరోనా చికిత్సలు పొందుతున్నారన్నారు.