ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో గత ఏడాది జూన్, జూలైలో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించిన సీసీఎంబీ
డిసెంబర్ 2020, జనవరి, ఫిబ్రవరి 2021లో ఉధృతంగా ఉన్న N440K
2021 మార్చి నుండి గణనీయంగా తగ్గిన N440K వైరస్ ప్రభావం
N440K రకం వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకరమైన వైరస్ గా నిర్ధారించబడలేదు
విజయవాడ, 06apreal(spread news) శాస్త్రీయ సమస్యలకు సంబంధించిన విషయాలను ప్రచురించే సమయంలో మీడియా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి:ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి.ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేరియంట్- B.1.36(N440K) ఉనికే లేదని, ప్రజలెవరూ అపోహలకు గురికావొద్దని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రకం కరోనా వైరస్ N440K వేరియెంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి సేకరించిన శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ (జన్యు శ్రేణి) పరీక్షలను హైదరాబాద్ లోని సీసీఎంబీ(CCMB) నిర్వహిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి నెల సగటున 250 శాంపిల్స్ ను హైదరాబాద్ లోని సీసీఎంబీకి పంపడం జరుగుతోందన్నారు. . సీసీఎంబీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కోవిడ్ పాజిటివ్ కేసుల్లో N440K వైరస్ వాటా నామమాత్రంగానే ఉందని స్పష్టం చేశారు.ఏప్రిల్ నెల డేటా ఆధారంగా ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల నమూనాల నుంచి B.1.617 మరియు B1 అధికంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. B.1.617 మరియు డబుల్ మ్యూటెంట్ గా పిలవబడే ఈ వైరస్ రకం మొదటిసారిగా భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలో గుర్తించడం జరిగిందన్నారు. ఈ వైరస్ చాలా తొందరగా వ్యాప్తి చెందుతోందని, పెద్దలతో పాటు యువకుల్లో సైతం దీని వ్యాప్తి అధికం ఉందని గుర్తించినట్లు వివరించారు.
. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కూడా తన నివేదికలో B.1.617ను వేరియెంట్ ఆఫ్ ఇంటరెస్ట్ గా ప్రకటించిందని పేర్కొన్నారు. అయితే N440K పై ఎలాంటి ప్రస్తావన చేయలేదని వెల్లడించారు. మీడియాలోని కొన్ని సెక్షన్లలో పేర్కొన్న విధంగా N440K వేరియంట్ ప్రజారోగ్యానికి ఆందోళన కలిగించే విషయమైనట్లయితే WHO తో పాటు ICMR నివేదికలలో తప్పనిసరిగా ప్రస్తావించబడేదని జవహార్ రెడ్డి పేర్కొన్నారు. విపత్కర సమయంలో ప్రజల మనస్సులో ఎలాంటి భయాందోళనలు సృష్టించకుండా నివారించాలని జవహార్ రెడ్డి ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు.