spread news;- ఒక మామూలు వ్యక్తి కూడా పరిశ్రమ స్థాపించేంత సరళంగా ఎమ్ఎస్ఎమ్ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మౌలిక సదుపాయాలుంటే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయన్న ముఖ్యమంత్రి ఆదేశాలనుసారం అడుగు ముందుకు వేయాలన్నారు. ఇప్పటికే ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 31 ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుల అభివృద్ధి జరుగుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.
ఎమ్ఎస్ఎమ్ఈ విభాగం ద్వారా జిల్లాలలో ఎక్కువ పరిశ్రమలను నెలకొల్పడంలో కీలకమైన ఉద్యోగులను తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'పైన కూడా పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి మేకపాటి చర్చించారు.వర్క్ ఫ్రమ్ హోమ్ పై మరింత దృష్టి పెట్టాలని ఐ.టీ శాఖ అధికారులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు.
ఐ.టీ ఉద్యోగులకు ఏపీఎస్ఎఫ్ఎల్ , ఇతర ఐఎస్ పీల భాగస్వామ్యంతో 99.9శాతం మంచి బ్యాండ్ విడ్త్ తో ఇంటర్నెట్ అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఐ.టీ పార్కులు, ఈఎమ్ సీల గురించి ఐ.టీ శాఖ అధికారులతో ఆయన చర్చించారు. అనంతరం, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో ఎవెనియోన్ సంస్థ(AVINEON) ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పరిశ్రమలోని వ్యర్థాలను పరిశీలించడం, పేలుడు పదార్థాలు ఉంటే అప్రమత్తం చేయడం, పేలుడు జరిగితే అలార్మ్ ఇచ్చి సందేశాలు వంటి అత్యాధునిక టెక్నాలజీ గురించి ఎవెనియోన్ ప్రతినిధులతో మంత్రి చర్చించారు.
మంత్రి పరిశ్రమల శాఖపై నిర్వహించిన సమీక్షకు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సుందర్, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఎమ్ఎస్ఎమ్ఈ సీఈవో పవనమూర్తి, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, ఐ.టీ శాఖ జాయింట్ సెక్రటరీ నాగరాజ, ఐ.టీ శాఖ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, లోకేశ్వరరెడ్డి, శ్రీనాథ్ రెడ్డి హాజరయ్యారు.