నా అభిమాన గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కు వందనం


    మానవత్వం పరిమళించిన మంచి మనిషికి వందనం


     స్ప్రెడ్ న్యూస్ ;- అతని పేరు మారన్. శ్రీలంక లో అతడు న్యాయశాస్త్రంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్. ఒకానొక ప్రమాదంలో దురదృష్టవశాత్తు మారన్ కనుచూపు కోల్పోయాడు. ఒకసారి స్థానిక టెలివిజన్ మారన్ ను ఇంటర్వ్యూ చేసింది. అందులో మారన్ మాట్లాడుతూ ‘’నాజీవితం చీకటిలోకి నెట్టివేయబడింది. జీవితం నిరాశను ఆశ్రయించింది. ఆ తరుణంలో నా అభిమాన గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటలను తనివితీరా వింటూ స్వస్థత పొందేవాడిని. ఆ పరంపరలో నేను కూడా బాలు పాటలు పాడుకుంటూ కాలం గడుపుతున్నాను. బాలు పాటలే నాకు వెలుగు రేఖలు’’ అని చెప్పాడు.


    ఈ విషయం ఎలాగో బాలు చెవిన పడింది. శ్రీలంక లో సంగీత కార్యక్రమంలో పాల్గొనడానికి బాలు అక్కడకు వెళ్లారు. మారన్ చిరునామాను సేకరించి అతని ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో మారన్ బాల్కనీలో కూర్చొని తదేకంగా పక్షుల కిలకిలారావాలను వింటూ వున్నాడు. బాలు అతని అతని భార్యకు తనెవరో చెప్పకుండా మారన్ వద్దకు వెళ్ళి అతడు కూర్చున్న కుర్చీ వెనుక నిలబడి ‘’నూరాండ గళ్ నీ వాంగవే’’ అనే ఒక పాట పల్లవి వినిపించారు. తమకంలో ఆ గానం వింటున్న మారన్ వీపు మీద చెయ్యి వేశారు బాలు. వెంటనే మారన్ ‘’ఎంతమంచి బాలు పాట గుర్తుచేస్తున్నారు. ఇంతకీ మీరెవరు?’’ అని ప్రశ్నించాడు. ‘’నేను కూడా బాల సుబ్రహ్మణ్యం లా పాడగలను


 నా పేరు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం....’’ అని బాలు అంటూ వుంటే నిజాన్ని నమ్మలేని మారన్ లేచి నిలబడి ‘’నేను ఎంత అదృష్టవంతుణ్ణి. కొలిచే దైవం ఎదుట ప్రత్యక్షమైంది’’ అంటుండగా అతణ్ణి కావిలించుకొని, మరలా కుర్చీలో కూర్చుండబెట్టి బాలు కొన్ని పాటలు తను పాడుతూ, మారన్ చేత పాడిస్తూ అతణ్ణి కొన్ని గంటలసేపు అలరించారు. మారన్ కుటుంబ సభ్యులు ఆ నమ్మలేని నిజాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టింది. మారన్ మంచి ఫలహారం, కాఫీ ఇచ్చి బాలు కి తన కృతజ్ఞతలు తెలియజేశారు. తన ప్రత్యేక అతిథిగా మారన్ బాలు నిర్వహించిన సంగీత కార్యక్రమంలో పాల్గొని తన అభిమానాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారు. మానవత్వం మూర్తీభవించిన గొప్ప ‘మనీషి’ మనందరి హృదయాలను దోచుకున్న బాలు. మంచితనాన్ని మూటకట్టుకొని దేవేంద్రుని ఆస్థానంలో ఘంటసాలతో కలిసి గళం కలిపేందుకు కాస్త తొందరపడి వెళ్ళిపోయారు. బాలుకి నివాళి.... బాలు విశేష గుణసంపదకు పాదాభివందనం.