ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో ఏపీకి ఫిషరీస్ యూనివర్సిటీ


రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్ల వ్యయంతో యూనివర్సిటీ


దేశంలో ప్రత్యేకంగా 5 మాత్రమే ఫిషరీస్ విశ్వవిద్యాలయాలు


మత్స్య రంగంలో సమగ్ర అభివృద్ధి దిశగా  ముఖ్యమంత్రి నిర్ణయం


     మత్స్య రంగంలో సమగ్ర అభివృధ్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీ కోసం ఏర్పాటు కోసం పీపీపీ పద్ధతిన రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్-2020కి సెప్టెంబర్ 3న జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మత్స్య సంపద అధికంగా, ఆక్వా రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న మత్య్స విశ్వవిద్యాలయం ద్వారా రాష్ట్రంలో మత్స్య, ఆక్వా రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ యూనివర్సిటీకి రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందని వివరించారు. నిపుణుల కొరత వల్ల ఆక్వా రంగానికి చెందిన రైతులు ప్రతి ఏటా రూ.2500 కోట్లు నష్టపోతున్నారని అంచనా.యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా ఈ నష్టాన్ని సులువుగా అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు.


    దేశంలో ప్రత్యేకంగా కేవలం 5 మాత్రమే ఫిషరీస్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని ఏపీలో యూనివర్సీటీ ఏర్పాటుతో మొత్తం సంఖ్య ఆరుకు చేరుతుందన్నారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్  ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ సంస్థ మహారాష్ట్రలో ఉండగా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర లో  మాత్రమే ఫిషరీస్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని తెలిపారు. ఆయా యూనివర్సిటీల్లో ఫిషరీస్ కోర్సులు మాత్రమే ఉన్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో తొలిసారిగా మరింత వినూత్నంగా ఏపీలో ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందన్నారు.


    ఓ వైపు పాడి పంటలతో రాష్ట్ర వ్యవసాయ రంగానికి తలమానికంగా నిలిచి దేశ ధాన్యాగారంగా పేరొందడం, మరోవైపు మత్స్యసంపద అధికంగా ఉన్న పశ్చిమగోదావరిలో యూనివర్సీటీ ఏర్పాటు నిర్ణయంతో జిల్లా వాసుల చిరకాల వాంఛ నెరవేరిందని కమిషనర్ అన్నారు. అంతేగాక మత్స్య పరిశ్రమలో జిల్లా బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు అదే విధంగా మంచి, ఉప్పునీటి వనరులతో రాష్ట్రం మత్స్య, ఆక్వా పరిశ్రమల అభివృద్ధికి అపరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఏర్పాటుతో ఆ స్థానాన్ని పదిపరుచుకుంటుందని తద్వారా అవకాశాలు మరింత మెరుగుపడతాయని సమాచార,పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.