నా ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం విచారణ జరపరాదనీ, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించరాదనీ, సీబీఐ విచారణకు అప్పగించరాదనీ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.ఇంతకాలం దమ్ముంటే విచారణ చేసుకోండి, మేం ఏ తప్పూ చేయలేదు, నిప్పులా బతికాం అంటూ భీషణ ప్రకటనలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన మద్దతుదారులు ఎందుకు స్వరం మార్చారు.కేసులు పెట్టుకోండని సవాళ్లు చేసిన టీడీపీ, తమపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతో కేసులు పెడుతోందని, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తమ వాళ్లను అరెస్టు చేస్తోందని ప్రచారం చేస్తోంది.ఇప్పుడు ఏకంగా అసలు కేసులే పెట్టవద్దని హైకోర్టుకు వెళ్లారు.
ఏకంగా అప్పటి అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పైనే ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఆరోపణ చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లకు సంబంధించిన హెరిటేజ్ సంస్థ భూముల కొనుగోలు మొదలు అప్పటి మంత్రులు నారాయణ, పుల్లారావు, కొందరు ఎమ్మెల్యేలు అంతా కలిసి 4 వేలకు పైగా ఎకరాల మేర ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేశారని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.ఈ క్రమంలోనే టీడీపీ తరఫు న్యాయవాది గత ప్రభుత్వాలలో జరిగిన వాటిపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేయరాదని వాదించడం విచిత్రమే.చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ అమరావతి రాజధానిలో అక్రమాలు జరగలేదని గట్టి విశ్వాసంతో ఉంటే వారు కూడా సిట్ లేదా సీబీఐ, ఏ విచారణకైనా సిద్ధమే అని చెప్పాలి తప్పఇలాజారిపోవడానికి ప్రయత్నించవచ్చా.
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో భాగస్వామి అయితే బీసీ కనుక అభియోగాలు మోపి అరెస్టు చేశారని ఆరోపించారు.కృష్ణా పుష్కరాలలో ఘాట్‌ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణ వేసి నలుగురు అధికారులపై దర్యాప్తు చేస్తుంటే అది మాజీ మంత్రి దేవినేని ఉమాను ఇబ్బంది పెట్టడానికే అని అంటారు.ఇప్పుడు ఏకంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికే రాజధాని భూ కుంభకోణం తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఆ మాట అనడం ద్వారా వారు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో స్కాములు జరిగాయని ఒప్పుకున్నట్లే అవుతుంది.కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఎస్ ఇంటిపై దాడి చేసి 2 వేల కోట్ల మేర అక్రమాలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయని ప్రకటన ఇచ్చింది. నిజానికి అది చాలా సీరియస్ కేసు. అయినా చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ దానిపై ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదు.