క్వారంటైన్ కేంద్రాలుగా పర్యాటక హోటళ్లు


      ఆదాయం పెంపుదలలో భాగంగా పర్యాటక హోటళ్లను కొవిడ్ క్వారంటైన్ కేంద్రాలుగా నిర్వహణకు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు(అవంతి శ్రీనివాస్) తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకులను అనుమతిస్తామని, అదే నెల 15వ తేదీ నుంచి బోటు టూరిజం ప్రారంభించనున్నామన్నారు.త్వరలో నూతన పర్యాటక పాలసీని తీసుకొస్తున్నామన్నారు. సచివాయలంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిందని, దీనివల్ల ముఖ్యంగా ఆదాయం పడిపోయిందని అన్నారు. పర్యాటక రంగంలో ఆదాయం పెంపుదలకు చర్యలు చేపట్టామన్నారు.


    ఏపీలో పర్యాటక రంగానికి అపార అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. అడ్వెంచర్ టూరిజం చిత్తూరులోని హార్సలీ హిల్స్ లో ఉందని, అదే బాటలో రివర్ టూరిజం, బీచ్ టూరిజంతో పాటు ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయనున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతితో త్వరలో నూతన టూరిజం పాలసీని తీసుకురానున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పది 5 స్టార్, 7 స్టార్ హోటళ్ల నిర్మించనున్నామన్నారు. రాష్ట్రంలో రూ.1000 కోట్ల విలువైన పనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి వెల్లడించారు. 


    సీఎం జగన్ చేతుల మీదుగా ‘ప్రసాద్‘ పథకానికి శ్రీకారం.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రసాద్ పథకం కింద సింహాచలం దేవస్థానం ఎంపికవ్వడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆనందం వ్యక్తంచేశారు. తిరుపతి, ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలను ప్రసాద్ పథకం కింద సిఫార్సు చేశామన్నారు. వాటిలో సింహాచలం దేవస్థానాన్ని ప్రసాద్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. మరిన్ని దేవాలయాలను ప్రసాద్ పథకం కింద గుర్తించేలా కేంద్ర ప్రభుత్వంతో తమ అధికారులు చర్చించనున్నారన్నారు. ప్రసాద్ పథకం కింద రూ.53 కోట్ల విలువైన  పనులను సింహాచలం దేవస్థానంలో చేపట్టాలని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు.