స్ప్రెడ్ న్యూస్,అమరావతి, ఆగస్ట్, 05;- ప్రజారంజక పరిపాలనలో కొత్త ఒరవడికి 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం' మరో ఆరంభమవుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమగ్రాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 9.46గం.లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-ఐఎస్ బీతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఏపీ ఈడీబీ, సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, ఐఎస్ బీ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ సంతకాలతో ఒప్పందం జరిగింది. ప్రజలు మెచ్చే పారదర్శక పాలను అందించడంలో సీఎం జగన్ రాజీపడరని మంత్రి తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఎంవోయూ కుదుర్చుకోవడం కొత్త ఉత్సాహాన్ని, మరింత బాధ్యతను పెంచిందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛాట్రే వెల్లడించారు. కచ్చితమైన ఆధారాలతో కూడిన ఆలోచనలను ఆచరణలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించేందుకు "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- ఐఎస్ బీ పబ్లిక్ పాలసీ ల్యాబ్" ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. ఈ ల్యాబ్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వప్నించే ప్రజా పరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనం, త్వరితగతిన కచ్చితమైన నిర్ణయాలు, ఖర్చులనుతగ్గించడం వంటి లక్ష్యాలను దశలవారీగా చేరుతామని మంత్రి ఆకాంక్షించారు. తద్వారా పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు భరోసాతో కూడిన భవిష్యత్ అందించే దిశగా ప్రభుత్వం దార్శనిక ఆలోచనలతో ముందుకు వెళుతుండడాన్ని ఐఎస్ బీ సంస్థ డీన్ రాజేంద్ర శ్రీవాత్సవ అభినందించారు. సరికొత్త మార్పును తీసుకురావడానికి వేగంగా, అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శైలిని మెచ్చుకున్నారు. సమాజ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరడంలో సలహాలను తీసుకుని వాటిని నిర్దేశించుకున్న సమయానికే చేరుకోవడంలో చిత్తశుద్ధిగా భాగస్వామ్యమందిస్తామని డీన్ రాజేంద్ర పేర్కొన్నారు.