కోవిడ్ మరణాల శాతం సంఖ్య ఒకటి కంటే తక్కువ ఉండేలా చూడండి


    కరోనా వైరస్ వల్ల చనిపోయే వారి సంఖ్య ఒక శాతానికి కంటే తక్కువగా ఉండేలా అవసరమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ(Rajiv Gauba) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలు,వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా జారీచేసిన మార్గ దర్శకాలు అమలు తదితర అంశాలపై శనివారం ఆయన  ఢిల్లీ నుండి  వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల సంభవించే మరణాలను కజూనిష్ట స్థాయికి అనగా ఒక శాతానికి కంటే మించకుండా అన్ని రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా కరోనా లక్షణాలు గల వారికి వీలైనంత అధిక సంఖ్యలో  టెస్టులకు నిర్వహించాలని ఆదేశించారు.


    అలాగే రెడ్ స్పాట్ లుగా మారేందుకు అవకాశాలు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా జారీచేసిన మార్గదర్శకాలను తుఛ: తప్పక పాటించేలా చూడాలని స్పష్టం చేశారు.ఇంటినుండి బయిటకు వచ్చినపుడు ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటివి ఖచ్చితంగా పాటించాలని ఒకవేళ ఎవరైనా ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  కరోనా వైరస్ నియంత్రణకు ఆరోగ్య సేతు యాప్ వినియోగం వంటి ఇతర సాంకేతిక విధానాలను పూర్తిగా వినియోగించుకోవాలని రాజీవ్ గౌబ సూచించారు.


    ఒకవైపు కరోనా వైరస్ నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు మరోవైపు వివిధ ఆసుపత్రుల్లో అవసరమైన పడకలు, ఆక్సిజన్ సౌకర్యం కలిగిన పడకలు,ఐసియు,వెంటిలేటర్లు వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లకు స్పష్టం చేశారు ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విజయవాడ లోని ఆమె క్యాంపు కార్యాలయం నుండి పాల్గొనగా,ఆర్ అండ్ బి కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, శాంతిభద్రతల అదనపు డిజి రవిశంకర్ అయ్యన్నార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్ పాల్గొన్నారు.