కరోనా పై అపోహలను తొలగించటంలో పాత్రికేయులు కీలకపాత్ర పోషించాలి


     కరోనా నేపధ్యంలో పాత్రికేయలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్ర మరియు జిల్లాస్థాయి లో గుర్తించిన కోవిడ్ ఆసుపత్రుల్లో పాత్రికేయులు, వారి కుటుంబాలను చేర్పించడం, వారికి సరైన వైద్య సేవలు అందే విధంగా ఆరోగ్య శాఖ ప్రతినిధి, సమాచార పౌరసంబంధాల శాఖ ప్రతినిధులను నోడల్ అధికారులుగా నియమించామని సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ మరియు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో పాత్రికేయ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  పాత్రికేయలు ఎదుర్కొంటున్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు  ఆరోగ్య శాఖ కమీషనర్ కాటమనేని భాస్కర్ తో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా కరోనా నేపధ్యంలో మృతి చెందిన 8 మంది పాత్రికేయుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. 


    ఈ సందర్భంగా కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ప్రతి జర్నలిస్ట్ ఒక సామాజిక డాక్టర్ గా మారి కరోనా పై సరైన సమాచారాన్ని అందించి, ప్రజల్లో అపోహలను తొలగించేందుకు తోడ్పాడాలని పిలుపునిచ్చారు. పాత్రికేయులు విధినిర్వహణలో భాగంగా అనేక ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని అలాంటి సందర్భంలో మాస్క్, శానిటైజర్ లు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  మృత దేహాల విషయంలో కూడా అనేక అపోహలు ఉన్నాయని, మృత దేహంలో 4 నుంచి 6 గంటల కన్నా  వైరస్ ఉండదన్నారు. దహన సంస్కారాల అనంతరం బూడిదలో కూడా   వైరస్ ఉండదని, ఖననం ద్వారా భూగర్భ జలాలు కలుషితం అవ్వవని ప్రజలలో పాత్రికేయలు చైతన్యం తీసుకురావాలన్నారు. అందుకే 54 కోట్లతో మొబైల్ విద్యుత్ దహన వాటికల కోసం ప్రత్యేక వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.


     రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 1 శాతం అని జాతీయ స్థాయిలో రెండున్న శాతం ఉందన్నారు.  బీపీ, షుగర్ వ్యాధు గ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ ఇమ్యునిటీ శాతాన్ని పెంచుకోవాలన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కరోనా పట్ల ప్రజలు చైతన్యంతో, అవగాహనతో ముందుకు వెళ్లే విధంగా మీడియా వాస్తవాలు అందించే విధంగా కృషి చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  కరోనా నియంత్రణకు ఎంతో పారదర్శకంగా పనిచేస్తున్నారన్నారు.   దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో 18.5 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారన్నారు. ఒక పక్క వైద్యులు కరోనా నియంత్రణకు ముందు వరుసలో నిలబడి వైద్యం అందిస్తున్నారని వారికి మీడియా కూడా సహకారం అందించాలన్నారు. చనిపోయిన పాత్రికేయులకు జర్నలిస్ట్ సంక్షేమ నిధి నుంచి సాయం అందించేవిధంగా చర్యలు తీసుకుంటామని పాత్రికేయ ప్రతినిధులకు సూచించారు.     


    ర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమీషనర్ దృష్టికి తీసుకొచ్చిన వారిలో చందు జనార్ధన్, అంబటి ఆంజనేయులు, చావా రవి, జి. ఆంజనేయులు, ఏ. అమరయ్య, టీవీ రమణ, సాంభశివరావు తదితరులు జర్నలిస్టు సంక్షేమం కోసం పలు సూచనలు చేశారు. వారు సూచించిన విషయాలను ముఖ్యమంత్రి ధృష్టికి తీసుకెళ్లతానని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.  సమావేశంలో సమాచార పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు దాసరి శ్రీనివాసరావు,సంయుక్త సంచాలకులు పోతుల కిరణ్ కుమార్,శ్రీమతి కస్తూరి తేళ్ల తదితర అధికారులు పాల్గొన్నారు.